YSRCP MP Vijaya Sai Reddy said that Few TDP Mlas wants to join in YSRCP and Party president YS Jagan Mohan Reddy will take decision on this matter.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి తమ పార్టీలోకి వచ్చేందుకు చాలా మంది ఎమ్మెల్యేలు, నేతలు ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే చర్చలు కూడా సాగిస్తున్నారని చెప్పారు. అయితే, తమ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చే వారి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి వుందని ఎంపీ విజయసాయిరెడ్డి వెల్లడించారు.విశాఖలోని పాతగాజువాక ప్రాంతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షా శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.
2019లో అధికారంలోకి వచ్చేది తామేనని, ఆపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్ జరిపిన అవినీతిపై చర్యలు తీసుకుంటామని, వారికి సహకరించిన అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఎర్రచందనాన్ని విక్రయించి డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తానని చెప్పిన చంద్రబాబు, రూ. 10 వేల కోట్ల రహస్య ఒప్పందాన్ని చైనాతో చేసుకున్నారని విజయసాయి ఆరోపించారు. 29సార్లు ఢిల్లీకి వెళ్లానని చెప్పుకునే చంద్రబాబుకు, అన్నిసార్లూ ప్రత్యేక హోదా గురించి అడగాలని గుర్తుకు రాలేదని విజయసాయి రెడ్డి విమర్శలు గుప్పించారు.