Film actor Sivaji has said that a national party has taken up ‘Operation Dravida’ to capture power in South India and is spending Rs 4,800 crore for the purpose. ysrcp and tdp leaders responds on this issue
నటుడు శివాజీ ఆపరేషన్ ద్రవిడ, ఆపరేషన్ గరుడ అంటూ గురువారం మీడియా ఎదుట సంచలన విషయాలు వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌లు స్పందిస్తూ.. సినిమాల్లో చూపించినట్లు రాజకీయ వ్యూహాలు ఉండవని కొట్టిపారేశారు.
దీనిపై తాజాగా, తెలుగుదేశం కూడా స్పందించింది. టీడీపీ నేతలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బుద్దా వెంకన్న తదితరులు మాట్లాడారు.
తాము నాలుగేళ్లుగా మిత్రధర్మం పాటిస్తున్నామని సోమిరెడ్డి తెలిపారు. తాము యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్, ఎన్డీయేల్లో భాగస్వాములుగా ఉన్నప్పటికీ ఎక్కడా గీత దాటలేదని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము అన్ని అవమానాలు భరించామన్నారు. కేసుల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టలేదని వైసీపీని ఉద్దేశించి అన్నారు.
బీజేపీ తెలంగాణలో తనంతట తానే తమ పార్టీతో తెగదెంపులు చేసుకుందని సోమిరెడ్డి చెప్పారు. అయినప్పటికీ తాము నిర్మలా సీతారామన్, సురేష్ ప్రభులను రాజ్యసభకు పంపించామని చెప్పారు. దేశంలో మరే ప్రాంతీయ పార్టీ కూడా బీజేపీని నమ్మే పరిస్థితుల్లో లేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీడీపీకి మిత్రధర్మం తెలుసునని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాలకు తాజాగా రూ.3వేల కోట్లు ఇచ్చి ఏపీకి విస్మరించారని చెప్పారు.
టీడీపీ ప్రవేశ పెట్టిన అవిశ్వాసానికి 160 మంది ఎంపీల మద్దతు ఉందని, దీనికి తోడు వ్యక్తిగతంగా ప్రధాని మోడీపై పలువురు బీజేపీ ఎంపీల్లో వ్యతిరేకత ఉందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అన్నారు. ఇప్పటిదాకా మౌనంగా ఉన్న వీరంతా అవిశ్వాసం తీర్మానంపై ఓటింగ్ ప్రారంభం కాగానే కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారేమో అన్నారు. అందుకే గత ఆరు రోజులుగా అవిశ్వాస తీర్మానాన్ని ఇస్తున్నప్పటికీ లోకసభలో చర్చను చేపట్టలేదన్నారు.
హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ ద్రవిడ అనేది కచ్చితంగా జరుగుతోందని బుద్దా వెంకన్న చెప్పారు. ఎదుటి వ్యక్తులను అణిచివేసే ధోరణి మోడీకి ఉందని, అందుకే ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన టీడీపీని ఇబ్బందులపాలు చేసే పనులు చేపట్టారని ధ్వజమెత్తారు.